Sunday, July 28, 2013

దటీజ్ యండమూరి-4

దటీజ్ యండమూరి -4 భాగం పూర్తిగా అర్ధం కావాలంటే మొదటి భాగం నుండీ చదవాల్సిందే...ఇవిగో ఆ భాగాలు...క్లిక్ చేయండి......  1      2       3  

4.ప్రమాణత: "ఈ ప్రపంచంలో నూటికి తొభైమంది అవతలివారు ఏం చెప్తే అది వినటానికి సిద్ధం వుంటారు"అని స్పష్టంగా నమ్మినవాడే నాయకుడు కాగలడు.వారిని నీవైపు తిప్పుకోవటమే కావల్సింది.బాబాల్నుంచి,రాజకీయనాయకుల వరకూ అలా తిప్పుకోగలిగిన సామర్ధ్యం వున్నవారే.నీలోనూ అలాంటి సామర్ధ్యం పెంపొందించుకో.
సామాన్యుడు తన కష్టాల్నుంచి బయటకు రావడంకోసం బాబానో,తననాయకుడినో నమ్ముకుంటాడు.అతడిని భ్రాంతిలో వుంచినంతకాలం నువ్వే నాయకుడివి.తాను సుఖంగా బ్రతకటానికి కావాల్సిన శక్తి తనలోనే వున్నదని,అవతలివారిలో గానీ ఇంకెక్కడోగానీ లేదని తెలుసుకున్న రోజు అతను నీలాగా నాయకుడు అవుతాడు.ఈ విషయాన్ని వారికి చెప్పినా,వివరించినా వారిలో చాలా మంది మారరు.వారికో అండ కావాలి.అది నువ్వే అవ్వాలి.దానిక్కావల్సిన తెలివితేటలు సంతరించుకో.
         "నేను పాపం చేసాను రక్షించు" అనేవాడు సామాన్యుడు."నేను పాపం చెయ్యను" అనేవాడు బుద్ధిమంతుడు."నేను చేస్తున్నది పాపమో కాదో నాకు తెలీదు"అనేవాడు తెలివైనవాడు.
         ప్రమాణం అంటే స్టాండర్డ్.చిత్రమేమిటంతే ఈ స్టాండర్డ్ అనే పదం కూడా రిలెటివే.ఏది ప్రమాణం? "మౌనా స్మూకః ప్రవచన పటుర్వాచకో"అన్నాడో సంస్కృత కవి.ఒక సేవకుడి పట్ల యజమాని ఏవిధమైన అభిప్రాయంతో ఉంటాడో ఈ పద్యంతో చెప్తాడు.మౌనంగా ఉంటే మూగవాడని,చక్కగా మాటలాడితే వదరబోతు అని,దగ్గరగా వుంటే భయభక్తులు లేనివాడని,దూరంగా ఉంటే పనిపట్ల ఆసక్తి లేనివాడని,మాటపడితే పిరికివాడని,పడక పోతే ఓర్పు లేనివాడని ప్రభువులు అంటారట.ఇది ఆకాలంలో మాట.ఈ కాలంలో అమ్మాయిలకు కూడా ఇది వర్తిస్తుంది.నువ్వొక అమ్మాయిని ముద్దడిగితే గౌరవస్తుడివి కాదు అంటుంది.ముద్దు అడక్కపోతే మగాడివే కాదు అంటుంది.పొగిడితే అబద్ధమంటుంది.పొగడకపోతే ప్రేమ లేదంటుంది.నువ్వు ఆలస్యంగా వెళ్తే ప్రేమ తగ్గిపోయిందంటుంది.తాను ఆలస్యంగా వస్తే పని వత్తిడంటుంది.నువ్వు మౌనంగా వినేటప్పుడు మాట్లాడమంటుంది.నువ్వు మాట్లాడేటప్పుడు నోర్మూసుకుని వినమంటుంది.నువ్వొక అమ్మాయితో మాట్లాడితే తనతో వదులుకోవటానికి సిద్ధంగా వుండమంటుంది.తానొక అబ్బాయితో మాట్లాడితే నువ్వు దాన్ని విశాల హృదయంతో అర్ధం చేసుకోమంటుంది.
          కాబట్టి ఏది స్టాండర్డ్? ఏ ఆనందమూ స్తాండర్డ్ కాదు.అంతకన్నా మరొకటి లేదని భావించిన మనుష్యులు కొత్తని అన్వేషించరు.అనూరాధ సుబ్బారావును ఆరు సంత్సరాలు పాటు ప్రేమించింది.మధ్యలో ఆనందరావు అనే మరో వ్యక్తి కూడా తన ప్రేమని ప్రతిపాదించాడు."భారత స్త్రీ ఒకర్ని ఒకసారే ప్రేమిస్తుంది.క్షమించు"అని ఆనందరావును తిరస్కరించింది.పెళ్ళి జరుగుతుండగా మంగళసూత్రం కట్టడానికి పీటమీదనుంచి లేచిన సుబ్బారావ్ గుండెపోటుతో అక్కడే మరణించాడు.ఆమె మండపం అంతా కలయజూసింది.శాలువా కప్పుకుని ఆనందరావు కనబడ్డాడు.అదే ముహూర్తానికి మెడలో సూత్రం కట్టమంది."స్త్రీ ఒకసారి ఒకర్నే ప్రేమిస్తుందన్నావ్ గా"అన్నాడు ఆనందరావ్."ఒక టైం లో ఒకర్నే ప్రేమిస్తుందన్నాను" అని సరిదిద్దింది.ఆనందరావ్ పెళ్ళికి సిద్దపడ్డాడు.
           "ఈ శవాన్ని కాస్త అడ్డుతీయండి"అంది పెద్దల్తో.
            ఈమె పట్ల నీ అభిప్రాయం ఏమిటి?మరీ విలువలు లేని స్త్రీగా కనబడుతుందా?సుబ్బారావ్ మరణించిన ఎన్నాళ్ల తరువాత ఈమె వివాహం చేసుకుంటే మంచిదని నీ ఉద్దేశ్యం?నెలా?సంత్సరమా?పదమూడు రోజులా? ఈ ప్రశ్నకు ఒకొక్కరు ఒకొక్కవిధంగా సమాధానం చెప్తారు."ఆమె ఎప్పుడు చేసుకుంటే మాకెందుకు?అది వారిష్టం అనరు"అనరు.ఏది ప్రమాణికత?ఇటువంటి స్టాండర్డ్స్ ని ధిక్కరించటమే నీవు చేయాల్సిన మొదటి పని.పై సంఘటనని మరోలా వూహిద్దాం.అనూరాధకి ఆ రోజుతో పాతికేళ్ళు నిండుతాయి.ఆ రోజు తరువాత పెళ్ళి చేసుకుంటే,తాతయ్య వీలునామా ప్రకారం రావల్సిన అయిదు లక్షల ఆస్తి రాదు.ఆమె తల్లికి కాన్సర్.ఆపరేషన్ కి అర్జెంటుగా అయిది లక్షలు కావాలి.ఇప్పుడు చెప్పు.నీ అభిప్రాయం మారిందా?కొత్తగా ఆలోచించడం అలవాటయిందా?నీలో ఒక కొత్త నువ్వుని గమనించావా?మార్పు అంటే అదే!
         నీలోంచి ఒక కొత్త నువ్వు బయటకొస్తూ వుండగా చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోతారు.ఇరుగుపొరుగువాళ్ళు బుగ్గలు నొక్కుకుంటారు.నీ స్నేహితులు నిన్ను పాతనిన్నుగా మార్చటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు.నువ్వు ఎదగటం ఎవరికీ ఇష్టంలేదు.స్నేహం పేరుతో నిన్ను మామూలుగా వుంచటానికి నీతో వాదిస్తారు.వారితో నువ్వు ఒకే విషయం గట్టిగా నొక్కి చెప్పు.
            "నేను మారదామనుకుంటున్నాను."
నీ మార్పు అయిదు రంగాలలో సాగాలి.అవి నీకు ఆనందం ఇవాలి.
           1.నువ్వూ,నీ కుటుంబం.
           2.నీ డబ్బూ, నీ వృత్తి.
           3.నువ్వూ,నీ ఆరోగ్యం.
           4.నువ్వూ, నీ కీర్తి.
           5.నువ్వూ,నీ వ్యక్తిగత జీవితం.

చివరిది ముఖ్యం.అది పై 4 వల్లా వస్తుంది.దానికోసమే ఈ సామాజిక బంధాలూ,నైతిక విలువలూ-అన్నిటినీ మనిషి నిర్మించుకునేది.నీ దృష్టిలో ఏది ప్రామాణికత [స్టాండర్డ్]నో నువ్వు నిర్ణయించుకో.దానికి నీ చుట్టుపక్కలవాళ్లు ఏ విలువని నిర్ధారిస్తారో అనవసరం.దానికేమీ విలువ లేదు.
మరో ఉదాహరణ చెప్తాను.విను.
నువ్వు కారు డ్రైవర్ వి అనుకో.నీయజమాని కుటుంబాన్ని నువ్వొక పార్టీకి తీసుకువెళ్లాలి.పార్టీ సరిగ్గా 10.00 గటలకి మొదలవుతుంది.కొండమీద హోటల్లో పార్టీ.అందరూ తీరిగ్గా తయారైవచ్చేసరికి 9.45 అయ్యింది.నిన్ను తొదరపెట్టసాగారు.నువ్వు మామూలుగా తీసుకువెళ్లితే 10.00 గానీ చేరుకోలేవు.వేగంగా వెళ్తే 10.00 గంటలకు వెళ్తావు.నిన్ను వేగంగా పోనివ్వమని అందరూ బలవంతపెట్టారు.ఊరు దాటాక ఒక ముసలమ్మను గుద్దావు.మరీ అంత వేగమా?అని మళ్లీ వాళ్లే నిన్ను తిట్టారు.ఓ వంద ఇచ్చిపోదామన్నారు.ఆమెకు పెద్ద దెబ్బలు తగలలేదు గానీ "దాహం" అంటోంది.రోడ్డు మీద ఎవరూ లేరు.నీవె వెళ్లి నీరు తీసుకొచ్చి ఇచ్చి తిరిగి బయల్దేరావు.మొత్తం కుంటుంబం అంతా నిన్ను తిట్టింది.పిల్లలు నీ పరోపకారబుద్ధిని ఎగతాళి చేసారు.అంతామౌనంగా భరించావు.అక్కడొక అడ్డదారి ఉంది అలా పోనిమ్మన్నారు.అది One-way Traffic. వారి సలహా వినపడనట్టు నటించి నువ్వు మామూలుగా పోనిచ్చావు.మళ్లీ తిట్టారు.వెళ్లేసరికి 11.00 అయింది.అక్కడికి వెళ్లేసరికి సరిగ్గా అయిదు నిమిషాల క్రితమే కొండచరియ విరిగి,హోటల్ ధ్వంసమై అందరూ మరణించారు అని తెలిసింది.తాము ఎంత కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకున్నామో ఆ తరువాత కధలు,కధలుగా అందరికీ చెప్పుకున్నారు.అందులో ఎక్కడా నీ ప్రసక్తి లేదు.ప్రపంచం ఈ విధంగానే వుటుంది.నీ"చెడు"ని గుర్తించినంత తొందరగా నీ "మంచి"ని గుర్తించదు.అలా గుర్తించాలనుకోవటం కూడా వృధా.కన్విక్షన్ తో బ్రతకటం మంచిదే.లేదా,ధైర్యంగా కన్వీనియెన్స్ తో బ్రతుకు.ఆత్మవంచన చేసుకోకు.ఈ ప్రపంచంలో 95% Convenience తో బ్రతుకుతూ,కన్విక్షన్ తో బ్రతుకుతున్నామనుకుంటారు.4% Conviction తో బ్రతుకుతారు.1% మాత్రమే కేవలం కన్వీనియన్స్ తో బ్రతుకుతున్నామని ధైర్యంగా వప్పుకోగల్గుతారు.
                                                                   Next Page-5

No comments:

Post a Comment

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.


కూడలి... poodanda...లేఖిని (Lekhini): Type in Telugu మాలిక: Telugu Blogs